29, జనవరి 2026, గురువారం

మహిళా జన అధికార్ సమితి,అజ్మీర్, రాజస్థాన్.

 డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎం జె ఏ ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఒక భాగం. మొదట అన్హాద్ ఫిలిమ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది .ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.


బాల్యవివాహాల  సంకెళ్లలో చిక్కుకొని కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు ఇప్పుడు చిన్న చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు .డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకుని మహిళా కార్మికుల దయనీయ జీవితాలు గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు.. చాలావరకు విజయం సాధించారు కూడా . వీరు తమ ఆలోచనలను  సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధి ంచిన వీరు శిక్షకులుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.

రాజస్థాన్లోని అజ్మీర్ లో అత్యంత సామాన్యంగా ఉండే రెండు అంతస్తుల భవనం ఉంది .అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేలుకుంటుంది. అన్ని వయసుల మహిళలు అక్కడ కనిపిస్తుంటారు. వారంతా బాల్య వివాహాల సంకెళ్ళకు బందీలే .నేడు ఆ మహిళలు బాలికలకు సాధికారత కలిపించడానికి మహిళా జన అధికార సమితి కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు. వీరంతా కెమెరాలు తీసుకొని షూటింగులకు వెళుతున్నారు. మరికొందరు తమ సినిమాలను ఎడిట్ చేయడానికి కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఉంటున్నారు. అంతా కలిసి వారు కొత్త భవిష్యత్తుకు ఒక్కొక్క ఫ్రేమ్ నుస్క్రిప్ట్ చేస్తున్నారు.

డిజిటల్ అక్షరాస్యత ..మహిళా జన అధికార సమితి ఆఫీసులో 30 మందికి పైగా మహిళలు చిత్ర నిర్మాణం ఎడిటింగ్  నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలలో కెమెరా పట్టుకొని ప్రపంచంపై దృష్టి సారించిన మొదటి వ్యక్తులు వీరే .పాతికేళ్ల క్రితం భూమి హక్కుల కోసం కుల వివక్ష బాల్యవివాహాలు పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడిన మహిళల నేతృత్వంలోని అట్టడుగు వర్గాల నుంచి ఈ మహిళ జన అధికార సమితి పుట్టుకు వచ్చింది .నేడు అక్కడి మూడు జిల్లాలలో ఈ సమితి తన ఉనికిని కొనసాగిస్తోంది. డిజిటల్ అక్షరాస్యత, నాయకత్వ కార్యక్రమాలు, లింగ సమానత్వం, గృహహింసపై దృష్టి సారించింది. మహిళల ఆందోళనలను వ్యక్తపరచడానికి వారి జీవితాలలో, సమాజాలలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.

గ్రామీణ మహిళల చేతిలో కంప్యూటర్ స్క్రీన్..

 ఈ ఆఫీసులోకి వెళ్లి చూస్తే ఎడిట్ రూమ్ లో 19 ఏళ్ల మంజు రావత్ తదేక దీక్షతో తన డెస్క టాప్ పైన సినిమాను ఎడిట్ చేస్తూ కనిపిస్తుంది .రెండేళ్ల క్రితం ఈ ఎన్జీవో లో చేరినప్పుడు ఆమె ఏకైక లక్ష్యం డిజిటల్ అక్షరాస్యత పొందడం .అయితే స్క్రిప్ట్, ఇంటర్వ్యూ ,కెమెరా వర్క్ తో సహా మహిళలకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాలని సంస్థ తీసుకున్న నిర్ణయం ఆమెలో ఆసక్తిని కలిగించింది. కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి మొదట మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వారు. కుటుంబంతో పాటు ఇరుగుపొరుగు వాళ్ళు ఆమె ఎలా తిరుగుతుందో చూడండి అనేవారు. కానీ వారి మాటలను పట్టించుకోలేదు అని చెబుతుంది మంజు రావత్. నాలుగేళ్ల వయసులోనే 20 ఏళ్ల వాడితో ముడిపెట్టిన చాందస కుటుంబం నుండి వచ్చిన రావత్ ఇప్పుడు తనలాంటి మహిళల సమస్యల పైన దృష్టి సారిస్తూ షార్ట్ ఫిలింలు తీసింది.

రావత్ చెల్లెలు సంజు వయసు 19 సంవత్సరాలు, ఆమె అజేసర్ గ్రామంలోని దినసరి కార్మికుల జీవితాలను చిత్రీకరించింది .

సవాళ్లను ఎదిరిస్తూ.. 24 ఏళ్ల భగవతి దేవికి 15 ఏళ్ల వయసులో  పెళ్లయి ంది. ఆమె తన గ్రామం భవానీ నుండి అజ్మీర్ కు ప్రతిరోజు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది .భగవతీదేవి ముసుగు ధరించే ఆచారం పైన, తగిన ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాల నుండి మినహా యించిన సంచార జాతి ఘమంతు తెగపై సినిమాలను నిర్మించింది. కోర్సు నేర్చుకుంటున్న మహిళలందరూ ఒక్కొక్కరు ఒక్కో సినిమా తీశారు. వీరంతా పురుషుల నుంచి కుటుంబాల నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నవారే. 2025 ఏడాది మొదట్లో 23 ఏళ్ల సంత్ర చౌరాసియా, భగవతి దేవి మరో ఇద్దరూ కిషన్ ఘడ్ లో ఒక పెళ్లిని చిత్రీకరించారు. ఇది వారి మొదటి ప్రొఫెషనల్ ప్రాజెక్ట్. వీరు తీసిన సినిమాలను చూసిన స్థానిక మహిళలు సంతోషిస్తుండగా పురుషులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటిగా నడుస్తాం. ఏ అమ్మాయి అయినా మా డిజిటల్ క్లాసులకు రాలేక పోతే మేమే వారి ఇంటికి వెళ్లి వెంటబెట్టుకొని వస్తాం .కుటుంబ ఒత్తిడి కారణంగా ఎవరు ఈ డిజిటల్ చదువు మానేయకుండా చూసుకోవాలని మేమంతా నిర్ణయం తీసుకున్నాం అని 22 ఏళ్ల మేరీ అంటున్నారు..

గతంలో మా కాలనీలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంటి నుండి బయటకు వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే. ఇప్పుడు చాలామంది మహిళలు నాతో చేరారు. ఇది మా సమిష్టి విజయం అని 21 ఏళ్ల ట్రైనర్ సమీరా భాను గర్వంగా చెబుతున్నారు. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల పైన సినిమాలు తీస్తూ వాటిని గ్రామంలో ప్రదర్శిస్తూ అవగాహన తీసుకువస్తున్నారు. మహిళాభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందించాలో తమ సినిమాల ద్వారా చూపుతున్నారు ఈ మహిళలు.


షీల్డ్ షూర్ ఇన్సూరెన్స్ ,థానే

 చిన్న పట్టణాలకు చెందిన ముగ్గురు మహిళలు కలిసి మన దేశ భీమా రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సంకల్ప బలం కలిగిన ఆ మహిళలు ఎవరంటే నైనా చౌహాన్ ,అనుశ్రీ వాస్తవ, షీబా నాజ్.

ఈ ముగ్గురు మహిళలు మన దేశంలో తొలిసారి డిస్కౌంట్ ఆధారిత బీమా స్టార్టప్ షీల్డ్ ఇన్సూరెన్స్ ప్రారంభించారు. థానే ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్ కు నైనా చౌహాన్ ఫౌండర్, అను శ్రీ  శ్రీ వాస్తవ కో ఫౌండర్, షీబా నాజ్ సి ఓ ఓ గా వ్యవహరిస్తున్నారు.

ప్రతి భారతీయ కుటుంబానికి భీమాను అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో స్టార్టప్ ప్రారంభించారు వీరు. మిగిలిన కంపెనీలతో పోల్చితే షీల్డ్ ష్యూర్ ను ప్రత్యేకంగా నిలబెట్టేది మహిళా సాధికారికత పట్ల దాని బలమైన నిబద్ధత అంటుంది కోపౌండర్ అనుశ్రీ. దీనిలో 90 శాతం మందికి పైగా ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కువమంది మహిళలే ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మా లక్ష్యం బీమాను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా భారతదేశం అంతటా మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని సృష్టించడం అంటుంది ఫౌండర్ నైనా. ప్రతి బీమా పాలసీపై ఐదు నుండి 25% డిస్కౌంట్ కూపన్లను అందిస్తోంది వీరి సంస్థ.



పర్యావరణహిత.. ప్రాజెక్టు ముంబై

 ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ముంబైలోని స్వచ్ఛంద సంస్థ " ప్రాజెక్టు ముంబై " ప్లాస్టిక్  రీసైక్లోథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నగా మొదలైన ఈ కార్యక్రమం ఉద్యమ స్థాయికి చేరింది. సాధారణ పౌరులు ఈ ఉద్యమంలో భాగమవుతున్నారు.

ప్రాజెక్టు ముంబైకి చెందిన స్వచ్ఛంద సేవకులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. విద్యార్థుల కోసం పాఠశాలలు కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రాజెక్టు ముంబై.  పౌరుల నేతృత్వంలో ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడానికి ఏర్పడిన అతిపెద్ద సంస్థగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధి ంచింది ప్రాజెక్టు ముంబై. ఇప్పటివరకు 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది. పార్కులలో పిల్లలు కూర్చునే బెంచీలను ,ఆడుకునే అందమైన బొమ్మలను, అందమైన చెత్త బుట్ట లను,ఇలా రకరకాల వస్తువులను తయారు చేసి ప్లాస్టిక్ ను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది.



బెంగళూరు రమేష్ బాబు

 బెంగళూరుకు చెందిన రమేష్ తండ్రి బార్బర్ గా పని చేసేవాడు. రమేష్ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. కుటుంబ భారాన్ని భుజాల ఎత్తుకున్న తల్లి ఇండ్లలో పనిచేసేది .కుటుంబానికి ఆర్థిక ఆసరా కోసం చిన్న వయసు నుంచే న్యూస్ పేపర్ లు అమ్మడం ,పాల ప్యాకెట్లు అమ్మడం మొదలైన పనులు చేసేవాడు రమేష్ .హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత పై చదువుల కోసం రోడ్డు పక్కన చిన్న సెలూన్ షాప్ నడిపేవాడు. తాను పొదుపు చేసిన డబ్బుతో 1993లో మారుతి వ్యాను తీసు. అది అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ వ్యాన్ ను అద్దె కి తిప్పే వాడు..

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో కార్ రెంటల్స్ కంపెనీ ప్రారంభించే స్థాయి కి చేరుకున్నాడు. రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, డిఫెండర్ మొదలైన వాటితో తన కంపెనీని లగ్జరీ కార్ రెంటల్ సర్వీసెస్ స్థాయి కి తీసుకువెళ్లాడు.

 ప్రస్తుతం కంపెనీ 400 వాహనాలను ఆపరేట్ చేస్తోంది. మన దేశానికి సంబంధించి లగ్జరీ టాక్సిస్ సెగ్మెంట్లో రమేష్ బాబు మార్గదర్శిగా నిలిచాడు. తాజాగా రమేష్ బాబు తన కంపెనీలోకి మూడు కోట్ల 20 లక్షల విలువైన రేంజ్ రోవర్ లాంగ్ వీల్ బేస్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కంపెనీ అధికారిక ఇంస్టా గ్రామ్ పేజీలలో షేర్ చేశారు. ఈ ఫోటోలో తన కుటుంబ సభ్యులతో కనిపిస్తారు రమేష్ బాబు.




Featured post

MANALO MANAM ...MANATHO MANAM